- అవగాహనలేమితో కొయ్యలు, గడ్డి పొలంలోనే దహనం
- భూమిలోని అవశేషాలు, ఖనిజ లవణాలు నశిస్తాయని అంటున్న వ్యవసాయ అధికారులు
మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :
వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు యంత్రాలను
ఆశ్రయిస్తున్నారు.వరి
కోతలకు హార్వెస్టర్ లను వినియోగిస్తుండడంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది.పశుసంపద ఉన్నవారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు అలాగే పొలంలో వదిలేస్తున్నారు.
తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలతో పాటు, గడ్డిని దహనం చేస్తున్నారు.అన్నదాతలు అవగాహన లోపంతో చేస్తున్న ఈ చర్యతో భూసారానికి ముప్పు పొంచి ఉన్నదని మండల వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలు…
వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది.
విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం, దిగుబడి
తగ్గిపోతుంది.
భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి.
పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి.
మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి.
పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక రకాల జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.
గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కూడా ఒక్కోసారి బుగ్గిపాలవుతున్నాయి.
ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాలు దగ్గరే ఉంటే ధాన్యం కాలిపోయే ప్రమాదం ఉంది.
కలియ దున్నితే ఎన్నో ప్రయోజనాలు…
వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది.
దుక్కి దున్నే సమయంలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.
కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారు అవుతుంది.
మొక్కలకు 2 శాతం నత్రజని, 4 శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది.
జింక్, మాంగనీసు, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులు అంది పంటకు మేలు చేకూర్చుతాయి
నేలలో కరుగని మూలకాలను అనుకూలంగా మార్చుతుంది. నీటి నిల్వ పెరుగుతుంది.
టన్ను గడ్డి కావాలంటే వరి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే గడ్డి ద్వారా పోషకాలు తిరిగి నేలకు చేరుతాయి.
పొలం దున్నే పది రోజుల ముందు గడ్డిని పొలంలో పరిచి నీరు అందించాలి. తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ పాస్పెట్ చల్లాలి. దీంతో భూమి దెబ్బతినడం నుంచి తప్పించడమే కాకుండా భూమిలో సేంద్రీయ పదార్థాల స్థాయిని పెంచవచ్చు.
ఈ పద్థతి పాటించడం వల్ల నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి దిగుబడి అవకాశాలు మెరుగుపడుతాయి అని వ్యవసాయ అధికారులు రైతు లకు సూచనలు చేస్తూ,,
వరి కొయలను, గడ్డిని కాల్చి భూసారానికి ముప్పు పొంచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులు రఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాలలోని రైతులకు తెలియ చేస్తున్నారు.