- మురికివాడల పిల్లల రక్షణకు ప్రత్యేక కార్యాచరణ
- అన్ని శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్: బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు చందన
మన ప్రగతి న్యూస్ / మేడ్చల్ జిల్లా స్టాపర్ :
జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని మురికివాడల్లో నివసించే వేలాది మంది చిన్నారుల భవిష్యత్తును కాపాడడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కదలాలని రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యురాలు చందన పిలుపునిచ్చారు. గురువారం మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్‌లో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.మురికివాడల్లో దయనీయ స్థితి ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ.. జవహర్ నగర్ పరిధిలోని సుమారు 100 కాలనీల్లో మెజారిటీ మురికివాడలేనని, అక్కడ పిల్లలకు కనీస విద్యా, వైద్య సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆధార్, జనన, కుల ధ్రువీకరణ పత్రాలు కూడా లేని స్థితిలో అనేకమంది చిన్నారులు ఉన్నారని కమిషన్ గుర్తించిందన్నారు. బాల కార్మికులు, బాల్య వివాహాలు, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మరియు డ్రాపౌట్స్ వంటి సమస్యలు అక్కడ అధికంగా ఉన్నాయని, వీటిని పరిష్కరించడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.’ఆపరేషన్ ముస్కాన్’ తరహాలో స్పెషల్ డ్రైవ్
బాల కార్మికులను గుర్తించేందుకు ‘ఆపరేషన్ ముస్కాన్’ తరహాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని లేబర్ డిపార్ట్‌మెంట్‌కు సూచించారు. స్కూలుకు వెళ్లని పిల్లలు, మధ్యలో మానేసిన వారి వివరాలు సేకరించి తక్షణమే నివేదిక అందించాలన్నారు. విద్య, వైద్య, రెవెన్యూ, పోలీస్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే ఆ పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించగలమని స్పష్టం చేశారు. తక్షణ చర్యలకు ఆదేశం అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జవహర్ నగర్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, అన్ని శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రావతి, కీసర ఆర్డిఓ రాజేష్, డిఈఓ విజయ కుమారి, డిడబ్ల్యూఓ శారద మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

