- విజయవంతం
ఒక్కరోజే 81,078 కేసుల పరిష్కారం - రూ. 34.54 లక్షల పరిహారం అందజేత
మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ :
న్యాయ వివాదాల సత్వర పరిష్కారమే లక్ష్యంగా కుషాయిగూడ జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ అద్భుత స్పందన లభించింది. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వి. బాల భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ మెగా లోక్ అదాలత్‌ను ప్రారంభించారు.
వేగంగా.. సులభంగా పరిష్కారం: ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సత్తు రవీందర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన కేసులను కక్షిదారులు ఎంతో సులభంగా, వేగంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 ప్రత్యేక బెంచ్‌ల ద్వారా రికార్డు స్థాయిలో కేసులు క్లియర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసుల వివరాలు: సివిల్ కేసులు: 39, క్రిమినల్ కేసులు: 81,007, ప్రీ-లిటిగేషన్ కేసులు: 32 (బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్), మొత్తం పరిష్కారం: 81,078 కేసులు, చెల్లించిన పరిహారం: రూ. 34,54,988, ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి. తిరుపతి, వివిధ విభాగాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నయ్య, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, పోలీస్ అధికారులు, బ్యాంకు మరియు బిఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న వివాదాలకు తెరపడటంతో కక్షిదారులు హర్షం వ్యక్తం చేశారు.

