ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే మాజీ మంత్రి ఎర్రబెల్లి నైజం
పదేండ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రజలను వంచించింది
ఎర్రబెల్లి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
ఎర్రబెల్లి వ్యాఖ్యలను ఖండించిన టూరిజం, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు
మనప్రగతిన్యూస్/పాలకుర్తి:
పదేండ్ల బిఆర్ఎస్ గడీల పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందారని టూరిజం, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టూరిజం అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించడాని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నైజం అని విమర్శించారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలన ప్రజలను వంచించిందని, ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారని వివరించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని విమర్శించారు. పదేళ్లుగా బిఆర్ఎస్ చేయని పనులను, పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందని, జీర్ణించుకోలేకనే దిగజారుడు విమర్శలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పదేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టిన బిఆర్ఎస్ నాయకుల్లో మార్పు రాలేదని ఘాటుగా విమర్శించారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ ను విమర్శించుకుంటూ పదవుల కోసం పాకులాడిన నీచ చరిత్ర దయాకర్ రావు దేనిని అన్నారు. పాలకుర్తిలో సరైన ప్రత్యర్థి లేకపోవడమే ఆడిందే ఆటగా మారిందని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని వివరించారు. పాలకుర్తి ప్రజలకు ఎర్రబెల్లి తో పీడ విరిగిందని గుర్తు చేశారు. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లకు జ్ఞానోదయం కలగడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటిని ధ్వంసం చేసిన కేసీఆర్ 7000 కోట్లకు ఓ ఆర్ ఆర ను అమ్ముకున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే సహించేది లేదని, నీతులు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను 10 నెలల్లో అమలు చేశామని తెలిపారు. ప్రజా పాలకుడు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తులసి వనంలో గంజాయి మొక్క ఎవరనేది పసిగట్టే ప్రజలు 2023 ఎన్నికల్లో తొలగించారని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం నీ నీచ రాజకీయాలకు నిదర్శనంగా మారాయని అన్నారు. నోరు దగ్గర పెట్టుకొన మాట్లాడితే మంచిదని, మహిళా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మహిళలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసేందుకు పాలకుర్తి నుండే ప్రారంభిస్తామని హెచ్చరించారు. మహిళ సాధికారతను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి మహిళల సంక్షేమం కోసం కేటాయించిన శ్రీనిధి డబ్బులను స్వాహా చేశావని ఆరోపించారు. మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, జాటోతు హమ్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధారావత్ సురేష్ నాయక్, మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, మాజీ ఎంపీపీలు గడ్డం యాకసోమయ్య, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, మొలుగూరి యాకయ్య గౌడ్, అనుబంధ సంఘాల అధ్యక్షులు లావుడియా భాస్కర్ నాయక్, బైకానీ ఐలేష్ యాదవ్, గాదెపాక భాస్కర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోనె మహేందర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థాన మాజీ డైరెక్టర్ లోనే శ్రీనివాస్, ఎడవల్లి సోమల్లయ్య, డాక్టర్ జి వై సోమయ్య, తడవెల్లి వెంకటేశ్వర్లు నాయకులు ఏలూరి యాకన్న తదితరులు పాల్గొన్నారు.