Breaking News

సీసీఐ తీరు.. పత్తి రైతు కన్నీరుపత్తి రైతు పరేషాన్.. తేమ పేరుతో తిరస్కరణ

  • తేమ పేరుతో తిరస్కరిస్తున్న వైనం
  • సీసీఐ కేంద్రాల్లో నాణ్యత పేరిట కొర్రీలు
  • సిండికేట్‌గా మారిన సీసీఐ నిర్వాహకులు, వ్యాపారులు
  • తక్కువ ధరకు కొనుగోళ్లు.. తూకాల్లో భారీ మోసాలు
  • నిలువునా నష్టపోతున్న పత్తి రైతులు
  • విధి లేక ప్రైవేట్‌ వ్యాపారులకు పత్తి విక్రయం
  • ధరలో దగా.. తూకంలో మోసం
  • పట్టించుకోని పాలకులు, అధికారులు
  • న్యాయం చేయాలని పత్తి రైతుల డిమాండ్

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

సీసీఐ తీరుతో పత్తి రైతు కన్నీరు పెడుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి ని అమ్ముకుందామంటే తేమ పేరుతో తిరస్కరిస్తుండడంతో విధిలేక అడిగిన కాడికి ప్రైవేట్‌ వ్యాపా రులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
రఘునాథ పల్లి మండలం ప్రాంతాల్లోని ప్రైవేట్‌ మిల్లుల్లో ఓ వైపు,సీసీఐ మరోవైపు, దళారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు.

తేమ సాకుతో సీసీఐ కొనకపోవడంతో రైతులు పత్తిని వేరేచోటకు తరలించడానికి వాహన కిరాయి భారమని భావించి అనివార్యంగా పక్కనే ఉన్న ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తున్నది. అక్కడ తెలివిగా తూకంలో మోసం చేస్తున్నారు. అనంతరం అదే పత్తిని సీసీఐకి విక్రయిస్తున్నారు. అదేవిధంగా 2 శాతం కమీషన్‌ సహా అన్‌లోడింగ్‌ చార్జీల పేరుతో మిల్లుల నిర్వాహ కులు, ప్రైవేట్‌ వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతున్నారు.

తేమ పేరుతో ధర తగ్గింపు..

కేంద్ర ప్రభుత్వం 8 శాతం తేమ ఉన్న ఏ-గ్రేడ్‌ పత్తి క్వింటాల్‌కు రూ.7,521, 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉంటే ఒక్కో శాతానికి రూ.75 తక్కువగా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం మాదిరిగా పత్తి ఆరబెట్టుకునే పరిస్థితి ఉండదు. మార్కెట్‌కు అమ్మకానికి తెస్తే అయితే సీసీఐకి లేదంటే ప్రైవేట్‌కు అమ్ముకొని ఇంటికి పోవాల్సిందే. ఒకసారి ఇంటి నుంచి వాహనంలో తెచ్చిన పత్తిని మళ్లీ తీసుకుపోవాలంటే కిరాయి మీద పడి రవాణా ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీంతో తేమ, పత్తి నల్లబారిపోయిందనే సాకుతో ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటా ల్‌కు రూ.1,000 నుంచి రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

తూకంలో మోసం..

ప్రైవేట్‌ మార్కెట్‌లో పత్తిరైతులు నిలువుదోపిడీకి గురువుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఎలక్ట్రానిక్‌ కాంటాల వినియోగంలో వ్యాపారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. రైతులకు తెలియకుండా తెలివిగా ఒక్కో తూకంలో 5 నుంచి 10కిలోల తక్కువ చూపించి మోసం చేస్తున్నారు. అటు ధరలోనూ ఇటు తూకంలోనూ రైతులను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. పత్తిలో నాణ్యతా ప్రమాణాలు బాగానే ఉన్నా తేమ యంత్రాల మాయాజాలంతో రైతులను నమ్మించి ధర తక్కువ చేసి అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నారు.

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలతో పత్తి రైతులు దగాకు గురవుతున్నారు. పత్తి అమ్ముకోడావడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈసారి కురిసిన అధిక వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో చేతికొచ్చిన పంటను కూడా విక్రయించడానికి నానా పాట్లు పడాల్సి వస్తోంది. సీసీఐ సెంటర్లకు పత్తి తీసుకెళ్తే నిర్వాహకులు తేమ పేరుతో కొర్రీలు పెట్టడంతో గత్యంతరం లేక దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పంట పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ రహదారి పక్కనే వాహనాలు పార్కింగ్.. ప్రమాదం జరిగితే ఎవరు దిక్కు.!

రఘునాథపల్లి లో జాతీయ రహదారి పక్కన ఉన్న సిరి జిన్నింగ్ మిల్లు పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు రోడ్డు పక్కనే వరుసగా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.పట్టించుకునే వారు లేరని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికి అయినా పత్తి రైతు సమస్యల కు పరిష్కారం చూపాలని ప్రజా పాలన ప్రభుత్వంను మండల రైతులు కోరుతున్నారు..