మన ప్రతి న్యూస్/ ఖమ్మం జిల్లా స్టాపర్
నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కి మట్టి తోలుతున్న టిప్పర్ డ్రైవర్లు సృష్టిస్తున్న బీభత్సం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రోడ్డుపై నడవడానికే సంకోచించే పరిస్థితి నెలకొంది.అదే కొంచెం మసకబారితే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిందే. ఇప్పటికే మండలంలో జరిగిన కొన్ని సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా చెప్పుకుంటున్నారు. క్షతగాత్రులు కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడితే మరి కొంతమంది ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డారు.అయినా వాళ్ల నిర్లక్ష్య ధోరణి మారలేదు.బహుశా వారిని మందలించేవారు లేకపోవడమే కారణమేమో..!. బుధవారం రాత్రి 10:55 గంటల సమయంలో మట్టితో వచ్చిన టిప్పర్ అన్ లోడింగ్ చేసిన తర్వాత డ్రైవర్ ట్రక్కు కిందికి దించకుండా మితిమీరిన వేగంతో వెళ్లడంతో లింగాల గ్రామంలో సుమారు 7 ట్రాన్స్పార్మర్లు వ్యవధిలో గల కరెంటు తీగలు తెగిపడ్డాయని, మూడు స్తంభాలు విరిగిపోయాయని స్థానికులు తెలిపారు.విద్యుత్ శాఖ అధికారులు సుమారు 50వేలు పైచిలుకు నష్టం వాటిలినట్లు తెలిపారు. ఇదే తంతు గత నాలుగు రోజుల క్రితం విశ్వనాధపురం నుండి పాయపూర్ కు మట్టి తోలే క్రమంలో కూడా జరిగిందని తెలియవచ్చింది.నష్టం సంగతి భగవంతుడేరుగు .. అదే ప్రాణనష్టం జరిగితే భర్తీ చేయగలరా..?అనేది స్థానికుల ప్రశ్న. పట్టపగలే చుక్కలు చూపిస్తున్న టిప్పర్ డ్రైవర్ మసకబారితే మద్యం మత్తులో తూలుతున్నారని, తమ డ్రైవింగ్ తో బీభత్సం సృష్టిస్తున్నారని వాపోతున్నారు. ఇంత జరుగుతున్న టిప్పర్ యాజమాన్యాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి?. గ్రీన్ ఫీల్డ్ హైవే పర్యవేక్షక అధికారులు ఏం చేస్తున్నారు..?. ప్రైవేటు టిప్పర్ యాజమాన్యాలు అనుభవం లేని డ్రైవర్లతో వాహనాలు నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కారణం ఏదైనా టిప్పర్ డ్రైవర్లను అదుపు చెయ్యకపోతే నిర్మాణాలు పూర్తయ్యలోగా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.నాణ్యత ప్రమాణాలను పరిశీలించాల్సిన అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు ఎంతవరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందేనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందిస్తారో? లేదో?చూద్దాం..