మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ములకలపల్లి మండలంలోని రింగిరెడ్డిపల్లి గ్రామాలోని స్మశాన వాటికకి దగ్గరలో రోడ్డుకి ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటినప్పటికీ కొందరు రైతులు, బాటసారుల తప్పిదంతో మొక్కలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ప్రభుత్వలక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోంది. మొక్కల చుట్టూ ముళ్లకంపలు, గడ్డి తొలగించకపోవడంతో రైతులు పొలాల్లోని చెత్తాచెదారం, ముళ్ల కంపలు తగులబెట్టే క్రమంలో, పాదచారులు వేసే నిప్పులకు మంటలు చెలరేగి మొక్కలు దగ్ధమవుతున్నాయి. గడ్డికి నిప్పంటుకోవడంతో వరుసగా అగ్ని రాజుకుంటూ హరితహారం మొక్కలకు అంటుకుని చాలా మొక్కలు కాలిపోయాయి. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. కార్పొరేట్ వ్యవసాయ దారుడి నిర్లక్ష్యానికి హరిత హారం మొక్కలు సుమారుగా 100 మొక్కలు అగ్ని ఆహుతి అయ్యాయి. ఎంపీ లక్ష్మయ్యను వివరణ అడగగా వాటి ఖర్చు సుమారుగా లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.