Breaking News

మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించండి

  • ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల మన ప్రగతి/ వికారాబాద్ ప్రతినిధి : మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో టీజిఓ జిల్లా కమిటీ, మహిళా, శిశు, దివ్యాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశానికి ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిని, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ… మహిళలు సమాజం పట్ల అవగాహనతోపాటు తమ హక్కులపై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు విద్యను అభ్యసించడంతోపాటు ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. సామాజిక మాధ్యమాల వల్ల మంచి చెడులను గ్రహిస్తూ సమాజంలో తోటి వారిని, కుటుంబాలలో మంచి మార్పులు తీసుకొచ్చే విధంగా మెసలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా చిన్ననాటి నుండి అమ్మాయిలను ప్రోత్సహించాలని ఆమె హితవు పలికారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ… నా జీవితంలో మొదటి గురువు తన తల్లి అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన విధంగా సమాజంలో అసమానతలకు గురికాకుండా, మహిళలను సమాన దృష్టితో చూడాలని కలెక్టర్ తెలిపారు. మగవారి విజయం వెనక మహిళల సహకారం తప్పక ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంలో మహిళా ఉద్యోగులు తమకు అప్పజెప్పిన పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారని, వారి విధిపట్ల ఉన్న అంకితభావానికి గర్విస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి, వైస్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన వారిలో కలెక్టర్ సిసి నరేందర్, డిపిఆర్ఓ సిబ్బంది సతీష్ కుమార్ లతో పాటుగా వివిధ శాఖలకు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. బొమ్మారాస్ పేట్ ఆశ్రమ పాఠశాల మహిళల ఉపాధ్యాయులు చేసిన బంజార నృత్యం, భరత నాట్యం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మహిళా దినోత్సవ అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా క్రీడాకారులకు, కలెక్టరేట్, మున్సిపల్, రెవెన్యూ, విద్య, వైద్య, పోలీస్ మహిళా సిబ్బంది, అంగన్వాడి, మహిళా సంఘాల సభ్యులకు బహుమతులను అంద జేశారు. కలెక్టరేట్ లో నిర్వహించిన రంగోలి, మ్యూజికల్ చైర్, చెస్ పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు, రక్తదానం చేసిన సిబ్బందికి అతిధుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, సిడబ్ల్యూసి చైర్ పర్సన్ వెంకటేష్, డిపిఓ జయసుధ, డిపిఆర్ఓ చెన్నమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం