మనప్రగతి న్యూస్ / నర్సంపేట (ఖానాపూర్) :
సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా నిర్వాహకులకు ఆదేశించారు. గురువారం నర్సంపేట మునిసిపల్ పరిధిలోని 8వ వార్డు లో, ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర కుటుంబ సర్వే ను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గణకులు కుటుంబ వివరాలు నమోదు చేస్తుండగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వేలో ప్రతి ఎన్యూమరేటర్ సగటున 15 ఇండ్ల వివరాలు నమోదు చేయాలని అన్నారు. సర్వే జరుగుతున్న సమయంలో కుటుంబ యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని, వారికి అర్థం అయ్యే విధంగా తెలియజేయాలని సూచించారు. సర్వే నమోదు వివరాలను క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్ లను ఆదేశించారు. నర్సంపేట మహాత్మా గాంధీ జ్యోతిభా పూలే గురుకుల పాఠశాల సందర్శించిన కలెక్టర్ నర్సంపేట పర్యటన లో భాగంగా మండలం లోని మహాత్మా గాంధీ జ్యోతిభా పూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు. లక్ష్యంలేని విద్యాభ్యాసం నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. ఆశయ సాధనకోసం ఉన్నతమైన లక్ష్యాలతో ప్రగతిపథంలో పయనించాలని విద్యార్థులకు పిలుపు ఇచ్చారు. వివిధ ప్రశ్నలు సంధిస్తూ విద్యార్థుల నుండి సమాధానం రాబడుతూ డా॥ సత్య శారదా చేసిన ప్రసంగం అందరినీ అలరించింది. జిల్లా స్థాయి షార్ట్ ఫుట్ లో సిల్వర్ పతకాన్ని సాధించిన రక్షిత విద్యార్థిని కలెక్టర్ అభినందించారు.
భవిష్యత్తు లో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని ఆకాంక్షించారు. నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఫార్మసీలో ఔషధాలను పరిశీలించారు. ఔషధాలు ఏమైనా కొరత ఉన్నాయాఅని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్లు సమయపాలన కచ్చితంగా పాటించాలని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
వైద్య కళాశాల వైద్య విద్యార్థుల హాస్టల్ గదులను కలెక్టర్ పరిశీలించి బోధన గురించి ఆరా తీశారు. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ కలెక్టర్కు తెలుపగా, ఆఫ్లైన్ తరగతులు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సిపిఓ గోవిందరాజన్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓ ఉమారాణి, ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్,మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ జోనా, తహశీల్దార్లు, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.