-కేటీఆర్ జైలుకు వెళ్లడం కంటే హరీష్ రావు భయం వెంటాడుతుంది
మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మన ప్రగతి న్యూస్/ జఫర్‌గడ్ :
తప్పు చేసిన కేటీఆర్ ను జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించడం ఖాయమని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్న రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వడంతో రైతులు నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్ద పీట వేసి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సన్న రకాల వడ్లకు క్వింటాకు 500 బోనస్ ఇవ్వడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారని శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు. ఈ రోజు స్వయంగా రైతులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అందించిన బోనస్ వివరాలను చెబుతూ ఉంటే సంతోషంగా ఉందన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పనికట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కైనా 500 బోనస్ ఇచ్చినట్టుగా నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని అన్నారు. ఇప్పుడు జఫర్‌గడ్ వేదికనుండి కేటీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాను మా పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్ముకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ అందించింది. మీరు అన్న మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారో లేదో ఆలోచించుకోవాలని అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్ ఏడాది పాలనలో 10 ఏళ్ల అభివృద్ధి చూపాలని అనడం బీఆర్ఎస్ నాయకుల మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారం కోల్పోయిన అక్కస్సుతో బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల పంట రుణమాఫీ చేసామన్నారు. డిసెంబర్ నెలలో ఆధార్ కార్డు రేషన్ కార్డు సరిగా లేని, పేరు తప్పుగా నమోదైన, రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణాల మాఫీ చేస్తాం అన్నారు. 2 లక్షల రూపాయల పైన పంట రుణాలు తీసుకున్న వారికి కూడా 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు రాబోతున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తొందరలోనే చిప్పకూడు తినడం ఖాయమని అన్నారు. కేటీఆర్ ను హరీష్ రావు భయం వెంటాడుతుందన్నారు. జైలుకు వెళ్తాను అన్న భయం కంటే వాళ్ళ బావ హరీష్ రావు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. హరీష్ రావు వేగంగా ప్రజల్లోకి వెళ్తున్నాడు, నా పరిస్థితి ఏంటి అనే భయంతోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు.
శిథిలావస్థలో ఉన్న జఫర్‌గడ్ పి ఎ సి ఎస్ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పిఎసిఎస్ బిల్డింగ్ నిర్మాణ పనులకు కోటి రూపాయలు మంజూరు ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో రైతుల పండించిన పంటకు మద్దతు ధర లభించాలని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూనే సన్నాలకు 500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్కుతుందని అన్నారు. ప్రభుత్వం పైన నమ్మకం ఉంచి ఐకెపి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బోనస్ కూడా తీసుకోవాలని ఎమ్మెల్యే రైతులకు సూచించారు.ప్రధానంగా నియోజకవర్గనికి మంజూరైన దాదాపు 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులను డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి రెడ్డి చేతుల మీదగా ప్రారంభించుకో బోతున్నట్లు తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఫ్యాక్స్ జఫర్‌గడ్ వారి ఆధ్వర్యంలో రైతులకు క్వింటాల్ సన్నారకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న సందర్భంగా మండల కేంద్రంలో చైర్మన్ తీగల కరుణాకర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి , తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య, ఎఎంసి చైర్మన్ లావణ్య – శిరీష్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐలయ్య, పాక్స్ వైస్ చైర్మన్ నర్సింగం, డైరెక్టర్లు,వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.