కుల గణనపై కేంద్రం ద్వంద వైఖరి
మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి
మన ప్రగతి న్యూస్/హనుమకొండ:
బీసీ కులగణనతో వెనుకబడిన వర్గాల్లో సామాజిక మార్పు రానున్నదని, అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందని మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం హన్మకొండ కాకతీయ విశ్వవిద్యాలయంలో పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు, జర్నలిజం విభాగ అధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ ఆధ్వర్యంలో కుల గణన-సామాజిక న్యాయం అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ పరిపాలన కాలంలోనే దేశంలో కులగణన జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు కులగణన చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. రాజకీయం లేకుండా ప్రజాస్వామ్యం లేదని మంచి చెడు ఆలోచించి ప్రజల మనోభావాలు కనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. మత, కులరహిత సమాజాన్ని ఆశించేవాన్ని నేనని, కానీ నేడు వాటి ఆదిపత్యమే కొనసాగుతున్నదన్నారు. సమాజ మార్పు కోసం రాజ్యాంగంలో ఇంకా మార్పులు రావాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరారని గుర్తు చేశారు. ఉన్న రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలని ధోరణి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల్లో వచ్చిన మార్పు కనుగుణంగా సర్వే చేస్తున్నదన్నారు. కులగనన సమాచారం అనేది ఒక టార్చ్ లైట్ గా పనిచేస్తుందని, ఏ వర్గం జనాభా ఎంతో చెప్పటానికి శాస్త్రీయంగా ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. కుల గణన పై కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తున్నదని, కొన్ని రాష్ట్రాల్లో ఒప్పుకొని ఇతర రాష్ట్రాల్లో వద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలన్నారు. కేంద్రం ఏం చేస్తుందో.. రాష్ట్ర పరిధి ఏంటి అనే విషయాలను తెలుసుకొని ముందుకు సాగాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కుల గణన అమలు చేయడం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. సర్వే అనంతరం దానిని ఆచరణలో పెట్టి అమలు చేస్తే ఫలితాలు వస్తాయన్నారు.