మన ప్రగతి న్యూస్/ నర్సంపేట రూరల్
తండ్రి దేశం కోసం జవాన్ కావాలనుకున్నాడు….భారత సరిహద్దులో సేవలు అoదించాలనుకున్నాడు…పేదరికంతో పాటు వృద్ధాప్యంలోనున్న తల్లిదండ్రుల సంరక్షణతో ఆశయం ఆగిపోయింది.ఐతేనేం కన్న కూతురుతో తన కల నెరవేర్చాలని అనుకున్నాడు…దేశం తరుపున తన కూతురు ఆడాలనుకున్నాడు…తన కుమార్తెలోని ఆటపైనున్న ఆసక్తిని గ్రహించి తర్పీదు ఇప్పించాడు…అంతే, 14 యేట చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరచి అండర్-17 జాతీయ క్రీడ ఐన హాకీ జాతీయస్థాయి పోటీలకు ఎన్నికై అబ్బుర పరిచింది… కనీసం ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబానికి చెందిన మొగులోజు సిరి డాటర్ ఆఫ్ మొగులోజు రాజు.
నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన మొగులోజు సిరి జాతీయ క్రీడ హాకీ అండర్-17 విభాగంలో జాతీయ స్థాయికి ఎన్నికై ఈ నెల 22 నుండి 27 వరకు హరియాణ రాష్ట్రం రోతక్ జిల్లాలో జరుగు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరుపున హాకీ ఆడబోతున్నట్లు గురిజాల ఉద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు, వ్యవస్తాపకులు గొలనకొండ వేణు, ప్రధాన కార్యదర్శి చుక్క రాజేందర్ గౌడ్ బుధవారం మీడియాకు తెలిపారు. గురిజాల గ్రామానికి చెందిన మొగులోజు రాజు వడ్రంగి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. చిన్నత్తనంలోనే తన కూతురు సిరిలోని ఆటలపై ఉన్న మక్కువను గ్రహించిన తల్లిదండ్రులు రాజు, రజిత పేదరికంలో ఉన్నప్పటికీ తన కూతురును ఎలాగైనా దేశం కోసం ఆడించాలని అనుకున్నారు. దాని కోసం ఆదిలాబాద్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ను ఎంచుకొని అందులో చేర్పించారు. చదువుతో పాటు సిరి హాకీ క్రీడ కోచ్ పెద్దివారు శ్రీనివాస్ దగ్గర పూర్తి స్థాయిలో శిక్షణ పొంది మెలకువలు నేర్చుకుంది. ఈ నెల 11,12,13 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 68 వ, వార్షికోత్సవం సందర్బంగా నవ్య భారతి గ్లోబల్ హైస్కూల్ లో సిరి ఆదిలాబాద్ జిల్లా జట్టు తరుపున హాకీ క్రీడ ఆడి అత్యుత్తమ ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యింది. ఈ నెల నవంబర్ 22 నుండి 27 వరకు హరియాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తరుపున జాతీయ స్థాయిలో ఆడనుంది. ఉద్యోగుల ఐక్యవేదికతో పాటు గ్రామ ప్రజలు సిరిని అభినందించి జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. దీంతో ఎనిమిదవ తరగతి చదువుతున్న సిరి అందరికి స్ఫూర్తిగా నిలుస్తుంది.