కార్మిక కర్షక దేశవ్యాప్త ఉద్యమాలను ఉదృతం చేద్దాం
రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏనుమాముల మార్కెట్లో విస్తృత ప్రచారం
మన ప్రగతి న్యూస్/ వరంగల్
రైతుల పంటల కనీస మద్దతు ధర చట్టంకై, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కె యం) రాష్ట్ర కన్వీనర్ పెద్దారపు రమేష్, జిల్లా కన్వీనర్లు వీరగోని శంకరయ్య సోమిడి శ్రీనివాస్ రాచర్ల బాలరాజు కార్మిక సంఘాల జిల్లా బాధ్యులు ముక్కెర రామస్వామి గన్నారపు రమేష్ సుంచు జగదీశ్వర్ పుల్ల రమేష్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు గోనె కుమారస్వామి సుధమల్ల భాస్కర్ లు డిమాండ్ చేశారు. రైతు కార్మిక హక్కుల కోసం జరిగే దేశవ్యాప్త ఉద్యమాలలో రాజకీయాలకతీతంగా పాల్గొని పాలకుల మెడలు వంచాలని పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే కార్మిక కర్షక ప్రజా దేశవ్యాప్త ఆందోళనను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ కే యం జిల్లా కన్వీనర్ కుసుంబ బాబూరావు, కార్మిక సంఘాల బాధ్యులు గంగుల దయాకర్ ల నేతృత్వంలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సందర్శించి రైతులను కార్మికులను కలుసుకొని కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టపడ్డ పండించిన పంటకు సరైన ధర లేక ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగి అప్పుల పాలై ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆదుకోవలసిన కేంద్ర రాష్ట్ర పాలకులు అది విస్మరించి మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా రైతులకు ఇచ్చే సబ్సిడీలను రాయితీలను తగ్గిస్తూ మార్కెట్ వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాల రూపకల్పన చేస్తున్నారని, మరోవైపు కార్మికుల శ్రమను దోచుకోవడానికి ఎన్నో పోరాటాలతో సాధించుకున్న చట్టాలను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చారని ఈ క్రమంలో పని గంటలను పెంచి కనీస వేతనం పెంచకుండా నిర్బంధంగా పని చేయించుకునే వెసులుబాటు పెట్టుబడిదారులకు కల్పిస్తున్నారని ఇలాంటి పరిస్థితులలో పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలే శరణ్యమని అన్నారు అందులో భాగంగానే ఈనెల 26న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు అందులో భాగంగా వరంగల్ జిల్లాలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి ఆందోళన చేపట్టామని రైతులు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సంఘాల జిల్లా నాయకులు మాలోత్ సాగర్, ఓదెల రాజన్న, చుక్క మొగిలి, ఎమ్ఏ పాష, ఐతం నాగేష్, ఊరటి హంసల్ రెడ్డి, రాయినేని ఐలయ్య, అజయ్ పరిమళ, గోవర్ధన్ ,రాజు, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.